హైదరాబాద్: కేసీఆర్ మంచి మాటకారి. కాదు కాదు మాటల మాంత్రికుడు. ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు ఎవరికీ అర్థం కావు. టైంను బట్టి మాట్లాడుతుంటాడు. ఎవరేం అనుకున్నా కూడా పట్టించుకోడు. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మిని చేయగల అపరచాణుక్యుడు. తప్పును ఒప్పనీ, ఒప్పును తప్పనీ చెప్పించే శక్తి సామర్ధ్యాలు కేసీఆర్ దగ్గరు పుష్కలంగా ఉంటాయి. అది ఆయనకు పుట్టుకతో వచ్చిన విద్య అని ఆయన గురించి బాగా తెలిసినోళ్లు చెబుతుంటారు. ఒక మాటలో చెప్పాలంటే తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లంటాడు. దానిని రుజువు చేసి కూడా చూపెడతాడు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే చేస్తున్నాడు. తెలంగాణ వస్తదనే నమ్మకం తనకు వుందనీ, దానికి సంబంధించి ఢిల్లీ పెద్దల నుంచి తనకు కొన్ని సిగ్నల్స్ అందాయనీ గత నాలుగైదు రోజులుగా చెబుతూనే ఉన్నాడు.  తెలంగాణపై తనకు కాకుండా మరెవరికీ సిగ్నల్స్ అందుతాయి? తెలంగాణ గురించి తనకే తెలుస్తదే తప్ప దారిన పోయే దానయ్యకు తెలుస్తదా అని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో తప్పుగా వక్రీకరించే వారిపై దాడి చేసినంత పని చేస్తున్నాడు. ఈ సిగ్నల్స్ విషయంలో పేపర్లోను కూడా ఉతికి ఆరేశాడు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుపై తనకు కేంద్రం నుంచి అనుకూలమైన సిగ్నల్స్ వస్తున్నాయంటూనే మరో వైపు ప్రళయం స్రుష్టిస్తామంటున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పెద్దలతో తాను నిరంతరం టచ్ లో ఉంటున్నాననీ, వారి నుంచి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తదనే నమ్మకం తనకుందంటూనే మరో 15రోజుల పాటు డెడ్ లైన్ విధించారు. ఈ నెలాఖరు వరకు ఆగుదాం. మంచి మాటకు తెలంగాణ ఇచ్చారంటే సరి. లేదంటే ప్రళయం స్రుష్టించడమేననీ అంటున్నారు.  తెలంగాణకు కేంద్రం అనుకూలంగా ఉన్నప్పుడు కేంద్రానికి డెడ్ లైను పెట్టడం, ప్రళయం స్రుష్టిస్తామనడం దేనికనీ ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. తెలంగాణ వస్తదనే సిగ్నల్స్ ఉన్నప్పుడు ఈ లొల్లి దేనికనీ ఎవరైనా ప్రశ్నించారో వారి భరతం పడుతాడాయన. సన్నాసులంటాడు. తెలంగాణ ద్రోహులంటాడు. తెలంగాణ ఇస్తామనీ తనకు సాక్షాత్తు ప్రధానే చెప్పారనీ, దానితోనే కొంత మౌనంగా ఉంటున్నట్లు చెబుతూ వచ్చిన కేసీఆర్ తాజాగా తన స్వరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలంగాణను ఎట్లా సాధించుకోవాలో తమకు బాగా తెలుసుననీ, దీని గురించి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, కేశవరావు వంటి వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాననీ, తెలంగాణ ఇవ్వదనీ తెలిసిన మరుక్షణమే ఉద్యమాన్ని ఎట్లా రగల్చాలో తన దగ్గర పక్కా ప్లాన్స్ ఉన్నాయంటున్నారు. ఓ వైపు తెలంగాణ వస్తదనే నమ్మకం ఉందంటూనే మరోవైపు ఈ నెల 20 తరువాత కేంద్రాన్ని ఒక ఊపు ఊపుతామంటున్నాడు. కేసీఆర్ వ్యవూహాలు అర్థం కాక మిగతా వారంత తలపట్టుకుంటున్నారు. జుట్టుపీక్కుంన్నారు. పైకి తెలంగాణ వస్తదనీ తనకు నమ్మకం ఉందంటున్నప్పటికీ లోలోలపల మాత్రం కేంద్రం మోసం చేస్తుందనే భావనలో కేసీఆర్ కూడా ఉన్నట్లు తాజాగా ఆయన తెలుగుతల్లిపై, ఆంధ్ర పెట్టుబడిదారులు పన్నులు ఎగ్గొట్టే దొంగలంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీమాంధ్రకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి నేతలు ఫైర్ కూడా అయ్యారు. కేసీఆర్ నోటి వెంట వస్తున్న వ్యాఖ్యలు మళ్లీ ఉద్యమాన్ని ఉధ్రుతం చేసేందుకు అలా మాట్లాడుతున్నాడనీ అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మొత్తానికి కేసీఆర్ ఉద్యమం వైపే మొగ్గు చూపుతున్నారనీ తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చెప్పనకే చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించిన చలో హైదరబాద్ కంటే ముందుగానే తెలంగాణ ఉద్యమాన్ని రగల్చడానికి కేసీఆర్ అన్ని విధాలుగా పక్కా పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: